Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆ హంతకుడి తలను 176 ఏళ్లుగా భద్రపరుస్తున్నారు!

పోర్చుగల్‌ లో ఒక హంతకుడి తలను గత 176 ఏళ్లుగా భద్రపరచడం ఆసక్తికరంగా అనిపిస్తుంది. సాధారణంగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తుల శరీరాలు చెడిపోకుండా భద్రపరిచి వారిని స్మరించుకుంటుంటారు. గతంలో రష్యా విప్లవకారుడు, రాజకీయవేత్త వ్లాదిమిర్‌ లెనిన్‌ మృతి చెంది 90 ఏళ్లు దాటుతున్నా ఆయన భౌతికకాయాన్ని మ్యాసోలియంలో ఇప్పటికీ జాగ్రత్తగా భద్రపరిచారు. ఆయన చరిత్రను భావితరాలకు చెప్పడంతోనే సరిపెట్టకుండా, ఆయన రూపాన్ని భావి తరాలకు చూపించాలన్న లక్ష్యంతో ఈ పనికి పూనుకున్నారు. పోప్ జాన్ పాల్ 2 పార్థివ దేహాన్ని కూడా భద్రపరిచారు. జాన్ పాల్ 2 అద్భుతాలు చేశారని, ఆయనకు సెయింట్ హుడ్ ఇచ్చే అవకాశం ఉందని వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన గొప్పతనాన్ని చాటేందుకు అలా భద్రపరిచారు.

వీటన్నిటికీ భిన్నంగా, పోర్చుగల్ లో మాత్రం డియోగొ అల్వెస్‌ అనే సీరియల్‌ కిల్లర్‌ తలను జాగ్రత్తగా భద్ర పరచడం విచిత్రం. ఈ చిత్రమైన కథనంలోకి వెళ్తే...1810లో గాలిసియాలో డియోగో అల్వేస్ జన్మించాడు. అక్కడి నుంచి చిన్నతనంలోనే పోర్చుగల్‌ కి అల్వేస్ వలస వెళ్లాడు. అక్కడ పెరుగుతూ దొంగగా మారాడు. పోర్చుగల్ లోని పెద్ద కాలువ వద్ద నిలబడి..కాలువ దాటుతున్న రైతులను దోచుకునేవాడు. వారి దగ్గర డబ్బు తీసుకుని వారిని ఆ కాల్వలోకి తోసి చంపేసే వాడు. ఇలా మూడేళ్లలో 70 మందిని హతమార్చాడు. దీంతో ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఆ కాలువను ప్రభుత్వం మూసేసింది.

 దీంతో రైతులు అటుగా రావడం మానేశారు. దీంతో ఇళ్లలో చోరీలు చేయడం ప్రారంభించాడు. ఎవరైనా ఎదురు తిరిగితే వారిని అంతమొందించేవాడు. దీంతో అతనిని అతి కష్టం మీద అరెస్టు చేసి, 1841లో ఉరితీశారు. లిస్బన్‌ లోని మెడికల్‌ కాలేజీ బోధకులు, శాస్త్రవేత్తలు కలిసి మనిషి పుర్రెకు సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకునేందుకు పరిశోధనలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఉరితీయబడ్డ అల్వెస్‌ తలను తమకు అప్పగిస్తే అతను నేర వృత్తిలోకి ఎందుకు దిగాడో.. ఎందుకు అలా హత్యలకు పాల్పడ్డాడో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. దీంతో ప్రభుత్వం అతని తలను వారికి అప్పగించింది. దానిపై ఎన్ని పరిశోధనలు చేసినా, వారు ఆశించిన ప్రయోజనం మాత్రం సాధ్యం కాలేదు. దీంతో పోర్చుగల్ లో ఉరిశిక్ష పడిన చివరి ఖైదీ, అతి కిరాతకుడు కావడంతో అతని తలను అలాగే భద్రపరిచారు. ప్రస్తుతం ఆ తల ‘ఫ్యాకల్టీ ఆఫ్‌ మెడిసిన్‌ ఆఫ్‌ ది యూనివర్శిటీ ఆఫ్‌ లిస్బన్‌’ లో భద్రంగా ఉంది.

More Telugu News